Monday, February 6, 2012

నమ్మలేక వెక్కుతోంది ఎందుకురా ఇలా














పసి పాపవే నీవనుకున్నా
నా ఎదపై నిదురించే అ చిన్ని పాపవే నీవనుకున్నా

నీ నవ్వులలోనే నా బ్రతుకు తెలవారుతుందని
మెరిసే నీ కన్నులలోని వెలుగు తానుకావాలని

ఎంత పిచ్చిగా నిదురపోయాను
దూరమైన నీ అడుగులు గుర్తించలేనంతగా

పిచ్చి నమ్మకంతో వత్తిలా కరిగిపోతూ
ఇంక అమ్మననే అనుకుంటోంది పిచ్చి తల్లి

తానే బొమ్మలా మారింది నువ్వాడుకుంటావని
పాతపడిన బొమ్మని విసిరేస్తావని ఇపుడేగా తెలిసింది

నీకుతెలియని గత వర్తమానాలే లేవు నాకు
కాని నాకు తెలియనిది నీ వర్తమాన భవిష్యత్తులే

తప్పటడుగులు వేస్తే చేయందించింది తానే
దారి తప్పిన నీ ఆడుగులకు అడ్డుపడి జారిపోతుంది తనే

నాన్నలూ అంటూ పొత్తిళ్ళలో దాచుకుంది
వొడిలో నుండి జారిపోతున్నా నిన్నాపలేకపోతోందీ తనే

అదను చూశి పదునుగా పొడిచావే దయగా
చావలేక బ్రతకలేక కొట్టుకులాడమంటూ చివరిగా

ఎందుకిలా చేశావని ఆడగాలనుంది
వేయినోళ్ళతో అది తన నమ్మకాన్ని వెక్కిరిస్తోంది

ఈ బంధాన్ని తెంచుకుని నువ్వెగిరిపోతావని
తెలిసి కుడా పిచ్చిగా అతుకులేయాలని అత్రపడుతుంది

పిచ్చి అమ్మ, పాతబడిన బొమ్మ తానని
తెలుసుకోలేక తెలిసినా నమ్మలేక వెక్కుతోంది ఎందుకురా ఇలా

Saturday, December 17, 2011

చూస్తారేం................













ధనుర్మాసమో మంచు తెరలో
ఏది ముందు ఏది వెనుకో
తెలియకుండా తికమక పెట్టెస్తూ
తెలుసుకునేలోపే చుట్టేశాయి చలికౌగిలితో

నెమ్మదిగా తెల్లని మంచుతెరలను
తొలగిస్తూ బిక్కు బిక్కుమంటున్నాడో
లేక హిమ కన్య సొగసులను తనివి తీర
ఆస్వాదిస్తున్నాడో ఈ సూరీడు, ఏమీ తెలియడం లేదే

వెన్నెల వగలాడి రాత్రంతా
ఊసులాడి నా నిద్ర దోచుకెళ్ళింది
అది చాలదన్నట్లు చలి నన్ను
చుట్టేసి బిగి కౌగిలితో జోకొట్టేసింది

మత్తునుంచి తేరుకునేసరికి
ముంగిట్లో గొబ్బెమ్మ తలనిండా
పూలెట్టుకుని కిసుక్కున నవ్వి
తనేసుకున్న రంగుల హొయలన్నీ చూపిచింది

హా... నాకూ గుర్తొచింది
అమ్మనడిగి నేనూ వెసుకుంటా
పట్టుపావడా, పూలగాజులు మా ఇంటికొచ్చే
ఆనందానికి సంతోషాల స్వాగత మివ్వడానికి

చూస్తారేం................
మీరూ రండి ముస్తాబయ్యి
చక్రపొంగలి, చెరుకుగడలు
మా ఇంట్లోని చేమంతి పూలు
మీకు ఇస్తా మరి

Thursday, December 8, 2011

ఒక్క మాట

ఎంత స్నేహమైనా
పెదవి విప్పనిదే
మనసు చెప్పనిదే
భావ మధురిమ
అంతరంగాన్ని తట్టదుకనులెంత మాట్లాడినా
ఆ మౌన భాష
తెలిసినదే అయినా
మనసు కోరుతుంది
నువు చెపితే వినాలని

ఒక్క మాట
చిన్నదైనా సరే
హృదయపు లోతులనుండి
పైకి పొంగితే
కురిపించదా చిరుజల్లులు
ఆ చిన్న మాటే
కసాయి గుండెనైనా
క్షణకాలం కదిలిస్తుంది
ఆ కదలిక చాలదా
ఆప్యాయతను మొలిపించడానికి