Thursday, February 18, 2010

విత్తుట - కోయుట 2









విత్తనం విత్తడంలోని ముఖ్యమైన ఉద్దేశ్యం, ప్రతిఫలం. ఒక వేళ ప్రతిఫలం ఆశించకుండా ఏదైనా ఇచ్చాము అంటే దానర్ధం, ఫలాన్ని ఇంతకుముందే మనం అనుభవించామని. అప్పుడు మనం తెలిపేది కృతజ్ఞత.

పరిశుద్ధ గ్రంధం చెప్పినట్లుగా విత్తడంలోని వివిధ పద్ధతులను, ఫలితాలను జాగ్రత్తగా గమనించి తెలుసుకుందాము.

దారిప్రక్కన పడిన విత్తనం:

ఏవరికోసమో, చేయాలి కనుక తప్పదన్నట్లు చేసే పని. ఎక్కడ విత్తుతున్నామో, ఎందుకు విత్తున్నామో ఏమాశించి విత్తుతున్నామో తెలియకుండా చేయడం. చాలామంది చెప్పడం మనం వింటుంటాము "నీకోసం నేను మ్రొక్కుకున్నాను" అని. కాని అది ఫలించిందాలేదా అన్నది మాత్రం వాళ్ళు ఎప్పటికీ గమనించరు. ఎదుటి మనిషి మెప్పు కోరి, తమ విలువ పెంచుకోవడానికో విత్తడం అన్నమాట.

ఒక్కమాటలో చెప్పాలంటే " ఫలించేనో లేదో, ఒక రాయి వేసి చూడటంలో తప్పేముంది" అనుకునే రకం.

ముళ్ళకంచెలలో పాడిన విత్తనం:

వితడానికేమో శ్రద్ధగానే విత్తుతారు. కాని ఎవరైనా ఇది జరిగేనా, ఫలించేనా అని మాట్లాడగానే నిరుత్సాహ పడి పోయి, పంటను గురించి శ్రద్ధ తీసుకోవడం మానేస్తారన్నమాట. ఈలోగా అపవాది వచ్చి, ఆపంటభూమిలో ముళ్ళ విత్తనాలు విత్తేస్తాడు. ముళ్ళకంపలను చూసి బేజారయ్యి అసలు పంటనే వదిలేస్తారు వీరు.

ఇది మధ్యమ పురుష లక్షణం. చివరివరకు పోరాడాలి, సాధించుకోవాలన్న తపన కరువైన మనుషుల లక్షణం

మంచినేలను పడిన విత్తనం:

ఇది ఉత్తమ పురుష లక్షణం.

విత్తిన దగ్గరనుండి, పంట చేతికొచ్చేవరకు అనుక్షణం జాగ్రత్తలు తీసుకే మంచి రైతు లక్షణం. తను విత్తిన పంట మొలకెత్తడం, పెరగడం, ఫలించడం అన్ని దశలను గమనిస్తూ, అవసరమైన చర్య తీసుకూనే గొప్ప లక్షణం. తన మూలధనం ఎలా వాడబడుతుందో, ఏవిధంగా పని చేస్తుందో, ఏదిశగా తన గమ్యం సాగుతుందో గమనించి, తన లక్ష్యం చేరుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకునే ఉత్తమ వ్యాపారవేత్త లక్షణం.

ఇదే భగవతుడు కోరుకునేది.

"మెలకువగా ఉండుడి. దొంగ ఎప్పుడు వచ్చునో అని గమనించే మంచి యజమానునిలా, యుద్ధానికి సిద్ధపడిన సైనికుడిలా అప్రమత్తంగా ఉండండి".

ఏర్పరచుకున్నా లక్ష్యాన్ని సాధించగలమన్న గురితో, విశ్రమిచక ప్రయత్నించండి. అదే నిరీక్షణతో, అదే విశ్వాసంతో విసుగక పోరాడే వారికే దేవుని ప్రోత్సాహం కూడా. సోమరులు దేవుని రాజ్యానికి, అంతే కాదు లోకంలో కూడా ఉన్నతులవడాని అర్హులు కారన్న విషయం గమనించాలి.

కాబట్టి మనకు ఇవ్వబడిన ప్రతి పనిలోను నమ్మకంగా ( లోక యజమానులకు) లోబడి పని చేయాలి. మంచి విత్తనం (శ్రమ, నేర్పు, నమ్మకం, ప్రార్ధన, చివరిగా ధనం) విత్తుతూ తగిన కాలంలో పంటను కోసుకోవడానికి సిద్దపడి ఉండాలి.

ప్రతి చిన్న విషయంలోనూ నమ్మకమైన వారినే యజమాని ఘన పరచడానికి ఇష్టపడతారు. ఆదాసునికే అధికారమివ్వడానికి సిద్ధపడతారన్న విషయం మరచిపోకూడదు.

అప్పగించిన బాత్యత చిన్నదా పెద్దదా మన స్థాయికి తగినదా లేనిదా అన్నది ముఖ్యం కాదు. ఎంత నమ్మకంగా బాధ్యత నెరవేర్చామన్నదే ముఖ్యం. మనుషుల దయను కోరక, దేవుని దయను కోరాలి. ఆయన మనలను మెచ్చుకోవాలి. బాధ్యత నెరవేర్చడమే మనం విత్తే మంచి విత్తనం.

ఒక కార్మికుడు తన నైపుణ్యమనే విత్తనాన్ని విత్తి మంచి పేరు, ఆత్మ సంతృప్తి, మంచి జీతమనే పంటను కోస్తాడు.

ఒక విద్యార్థి కష్టపడి చవడమనే విత్తనం విత్తి, మంచి మార్కులు, ఉన్నతమైన జీవితమనే పంటను కోస్తాడు.

మంచి ఇల్లాలు శ్రధ, ప్రేమ, మంచి నడవడికను విత్తి, ఆనందం, అభివృద్ధి, మంచి కుటుంబమనే పంటకోస్తుంది. ఒడిదుడుకులు లేని సంతోషకరమైన జీవితాన్ని తాను పొదడమే కాక తన పిల్లలకూ అందిస్తుంది.

మంచి విశ్వాసి నిరీక్షణ, ప్రేమ, విధేయత, ఇచ్చుట అనే విత్తనం విత్తి పరిశుద్ధాత్మ, ఆశీర్వాదం, ఆశీర్వాదకరంగా ఉండటం, సంవృద్ధి కలిగి జీవించడం అనే మొదలగు పంటలను కోస్తాడు.

దశమ భాగం విత్తడం గురించిన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం.

Wednesday, February 17, 2010

విత్తుట - కోయుట 1








ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా ఇష్టపడిన విషయం, అనుభవపూర్వకంగా నేర్చుకుని ఆచరించిన విషయం ఇది.

రైతు ఏదైనా పంటను ఆశించినపుడు ముందుగా దానికి సంబధిచిన ప్రణాలికను తయారు చేసుకుంటాడు. ఆ ప్రణాళికను తన మనో నేత్రంతో దర్శించి, ఆపై నమ్మకంతో ఆ పంటను విత్తడానికి పూనుకుంటాడు.

అతనికి ఖచ్చితమైన, నిర్ధిష్టమైన కొన్ని అభిప్రాయాలు, ఆలోచనలు అప్పటికే ఏర్పడి ఉంటాయి. తన నమ్మకం నిజమవుతుంది లేదా నిజమే అనడానికి కావలసిన ఆధారాలను సంపాదించుకుని, అడిగిన వారికి లేదా తన పనికి సరి అయిన సమాధానాన్ని సిద్దపరచుకుని ఉంటాడు.

ముందుగా విత్తనాన్ని సపాదించి శుద్ధి చేసుకుని, పొలం / నేల ను దున్ని పదును చేసి, తగినంత నీరు పెట్టి పంట విత్తడాని తయారు చేసుకుంటాడు. ఎంత పంటను ఆశిస్తున్నాడో దానికి తగినంత విత్తనాన్ని విత్తుతాడు.

అక్కడితో అతని భాధ్యత తీరిపోలేదు. తన పంట ఫలించి చేతికి వచ్చేవరకు నమ్మకంతో దానికి తగిన పోషణ చేస్తూనే ఉంటాడు. ఒకవేళ మధ్యలో ప్రతికూల పరిస్థితులు వస్తే ఎదుర్కోవడానికి మార్గాలను, అవసరమయిన సరంజామాను ముందే సిద్దం చేసుకుంటాడు.

అలాగే ఆత్మీయంగా మనం ఏదైనా ఫలాన్ని ఆశిస్తే, మన హృదయాన్ని ముందుగానే సిద్దం చేసుకోవాలి. మనం ఏమి ఆశిస్తున్నామో సరి అయిన అవగాహన కలిగి ఉండాలి. ఆశిస్తున్న ఫలానికి సంబందిచిన విషయాలను అంటే ఇంతకు ముందు జరిగిన విషయాలను, జరుగుతాయి అన్న సూచనలను గమనించుకోవాలి. వాటిని (ఆ వాక్య భాగాలను) సేకరించుకోవాలి.

ఇక ఇప్పుడు మన ప్రణాలికను సిద్దం చేసుకుని, విత్తనన్ని విత్తాలి. అదే విశ్వాసమనే ఆయుధంతో మన హౄదయాన్ని పదును చేసి, అదృశ్యమైనవి మనో నేత్రం ముందు ఆవిష్కరించి, వాక్యమనే ఆధారంతో విత్తాలి.

ప్రతి రోజు ఆ మనో దౄశ్యాన్ని మరింతగా అభివృద్ధి పరచుకుంటూ, ప్రవచనాలను, వాక్యభాగాలను ఆధారం చేసుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. అపోస్తలులు చెప్పినట్లు అదృశ్యమైనవి చూడగలగడమే, అసాధ్యమైనవి సాధించడంలోని అసలు రహస్యం. నిరీక్షణను ఏమాత్రం కోల్పోకుండా కాపాడుకోవడమే జయించడానికి మూలకారణం.

దేవుని సన్నిధిలో మనం ఒక విషయాన్ని గురించి ప్రార్దిస్తున్నప్పుడు, ఆవిషనికి సంబంధిన విషయాలు ఇంతకు క్రితం జరిగినవి, జరగనున్నవి అని చెప్పే వాక్య భాగాలను నిత్యం ధ్యానిస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితిలోను అపనమ్మకాన్ని దరి చేరనీయకూడదు.

పర్వతారోహకుడికి ముందు చేరవలసిన గమ్యమే తప్ప, ఎక్కి వచ్చిన ఎత్తు గుర్తుకు రాకూడదు. ఒక వేళ అంత ఎత్తునుండి క్రిందకు చూస్తే కళ్ళు తిరిగి, గుండే బలహీన పడి గమ్యం చేరలేక పోవచ్చు. కాబట్టి మనకు కూడా సాధించాల్సిన లక్ష్యమే గుర్తుండాలి కాని, అది సాధ్య పడదేమొ అన్న ఆలోచన ఎప్పుడు దరి చేరకూడదు.

పరిశుద్ధ గ్రంధంలోని మాటలు, ప్రవక్తల మాటలు మనలను ప్రోత్సాహ పరచే మాటలే మన ధ్యానంలో నిత్యం ధ్యానిస్తూ ఉండాలి.

కానుకలు ఇచ్చేటప్పుడు, మనం ఎందుకు ఇస్తున్నామో, ఏమి ఆశించి ఇస్తున్నామో స్పష్టమైన అవగాహన ఉండాలి. ఎందుకంటే మనం ఇది ధేవుని దగ్గర చేస్తున్న ఇన్వెస్ట్ మెంట్. చేసే ఇన్వెస్ట్ మెంట్ గురించిన అవగాహన లేకపోతే వచ్చిన ప్రతిఫలం ఖచ్చితమైనదే అని గ్రహించడం? ఎంత విత్తుతున్నామో, ఎలా విత్తుతున్నామో తెలియకపోతే, ఎంత పంటను కోసుకోవాలో, ఎంత ఆశిస్తున్నామో ఎలా తెలిసేది?

అందుకే దేవుడు ఇలా చెప్తున్నాడు "వెలుగులో నడిచేవాదికి మరెవ్వరూ దీపం తో దారి చూపనవసరం లేదు". దానర్ధం జ్ఞానంతో, తెలివితో, తను చేస్తున్న పనిపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తికి మరెవరి విశ్లేషణ అవసరం లేదు.

విట్టుటలోని పద్దతులు, ఫలితాలు వంటి మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.

Tuesday, February 16, 2010

మన మాటకు విలువ కావాలంటే...









ప్రతి ఒక్కరూ తమ మాట లేదా తమ ప్రార్ధన విలువ నివ్వబడాలని, అది ఫలించాలని కోరుకుంటారు. కాని చాలా సార్లు అది జరగదు. అప్పుడు అనుకుంటాము

"అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమివ్వని వేలుపు
గ్రక్కున విడివంగ వలయు
గదరా సుమతీ" అని.

కాని అసలు లోపం ఎక్కడుందో తెలియదు. చాలా వరకు తెలుసుకునే ప్రయత్నం చేయము. మన విజ్ఞాపన ఫలించాలంటే ఒక సూత్రం ఉంది. మనం ఎవరికైతే విజ్ఞాపన చేస్తున్నామో ఆ వ్యక్తి పట్ల విధేయత కలిగి ఉండటం, మరొకటి మన ప్రవర్తనను బట్టి మనం గౌరవించబడే వారిగా ఉండటం.

నావరకైతే రెండో మార్గమే బాగుంటుంది. ఈ వ్యక్తి గౌరవించ దగిన వ్యక్తి, హాని కరుడు కాదు అని మన గురించిన మంచి అభిప్రాయం ఎదుటి వారికి ఎలా కలుగుతుంది? అందుకు మనం చేయవలిసింది ఏమిటి?

దానికి భగవంతుడు ఇచ్చిన ఆజ్ఞ "నీవు ధీర్ఘాయుష్మంతుడవగుటకు నీ తల్లిని తండ్రిని సన్మానించుము".

ఇక్కడ ధీర్ఘాయుష్మంతుడవగుటకు అన్న మాటను మనం ఏవిధంగా అర్ధం చేసుకుంటాము?
ఒకవ్యక్తి అనేక సంవత్సరాలు జీవించడం అని కదూ! మరి జీవించడం అన్న మాటకు ఉన్న అర్ధాలు తెలుసుకుందాము.
1. ఆరోగ్యంగా ఉండటం.
2. సంవృధ్ధి కలిగి ఉండటం.
3. ఆశీర్వదించబడి, ఇతరులకు ఆశీర్వాదకరంగా బ్రతకడం.
4. ప్రతి సమస్యను సమర్థవంతంగా పరిష్కరిస్తూ, నలుగురికీ మార్గదర్శకంగా జీవించడం.
5. తన చుట్టూ ఉన్న పదిమందికి సహాయం చేస్తూ, వారు కూడా తనవలె సంతోషంగా బ్రతికేలా సహాయం చేస్తూ జీవించడం. ఇలా అనేక మైన అర్ధాలు పరిశుద్ధ గ్రంధంలో చెప్ప బడ్డాయి.

మొదటగా తల్లి తండ్రులను గౌరవించే వ్యక్తి దేవుని దృష్టిలో విలువ కలిగిన వాడు. అది మాత్రమే కాదు ఈ లొకంలో కూడా అతనే ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అలా అని వాళ్ళు చెప్పిన మాటనే శిరోధార్యమనుకోమని కాదు. వాళ్ళు ఏది చెప్పినా విని మొదటగా వారి మాటకు విధేయులై, ఆమాటలోని మంచి చెడులను విశ్లేషించగలగాలి. తన అభిప్రాయాలను వారితో చర్చించి సాధ్యాస్ధ్యాలను వివరించ గలగాలి. అప్పుడే అతను ఇతరులను నొప్పించక ఒప్పించగలిగిన నేర్పరి కాగలడు.

ఏలాగంటే, మన ఇంట్లో మన తో కలిసి జీవించే వారి అభిప్రాయాలు, ఆలోచనా విధానం, వారి మనస్తత్వం తెలిసి మసలుకోగలగడమే మన వ్యక్తిత్వం. ఇంట్లో వాళ్ళనే అర్ధం చేసుకోలేని వాళ్ళు ఇతరులనెలా అర్ధం చేసుకోగలరు? ఇంట్లో వాళ్ళనే ప్రభావితం(కన్విన్స్) చేయలేనివాళ్ళు ఇతరులనెలా ప్రభావితం చేయగలరు? ఆలోచించండి. మనలను కని, పోషించి పెద్ద చేసిన తల్లి తండ్రులకు విలువనివ్వడం మనలను మనం గౌరవిచుకోవడమే కదా?

అదే మనిషి మనుగడకు, అతని అభివృధికి మూలకారణం. అలాఅని పెద్దలు పిల్లలను పెంచే విధానం చెప్పలేదనుకోవద్దు. పిల్లలు మంచి లేదా చెడు మార్గంలో నడిచారంటే అందుకు కారణం, సమాధానం చెప్ప వలసింది పెద్దలే.

"బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పిచు. అతను బాగు పడాలని, సుశిక్షితుడవ్వాలని శిక్షించు కాని చెడిపోవడనికి, చనిపోవడానికి కాదు. పిల్లల అభిప్రాయాలకు విలువనిస్తూ, వారిని గౌరవిచండలోనే దేవుని సమక్ప్లాన్ని నేరవేర్చిన వారవుతారు" ఇది పెద్ద లకు దేవుడిచ్చిన ఆజ్ఞ.

కాబట్టి దేవుడైనా లేదా మరేవరైనా మన మాటలకు విలునివ్వాలన్నా లేదా మన ప్రార్ధనలకు సమాధానమిచ్చి నెరవేర్చాలన్నా ముందు మనం తల్లితండ్రుల మాటకు విలువనిచ్చి విధేయులుగా ఉండటం ముఖ్యం. ఆవిధంగా మంచిచెడుల వివేకాన్ని, విశ్లేషణను మన పిల్లలకు అనుభవ పూర్వకంగా నేర్పిచడమే భగవంతుని గౌరవించడం.

భగవంతుని ఆజ్ఞలను పాటించడమే మనం ఆయనకు ఇచ్చే గౌరవం. అప్పుడే ఆయన మనలను గౌరవించి మన మాటలకు, జీవితాలకు విలువనిస్తారు. ఆయన చెప్పిన మాటను మనమిక్కడ జ్ఞాపకం చేసుకుందాము "నా మాట విని ఆప్రకారము చేయువాడే నా సహోదరుడు". కాబట్టి ఈ మాట ప్రకారం మనం మొదటగా మన తలి తలండ్రులను గౌరవించవలసి ఉంది. క్రీస్తు ఈ లోకంలో జీవించి నప్పుడు 30 సంవత్సరాలు తన తల్లికి (శారీరకంగా) లోబడి మనకు మాదిరిగా నిలిచారు. మిగిలిన 3 1/2 సంవత్సరాలు తన పరలోక తండ్రి ఇష్టాన్ని, తనపై ఉంచిన బాధ్యతను నెరవేర్చారు.

ఈ విధంగా ఆయన ఆజ్ఞను పాటించిన వారు తప్పకుండా సంవృద్ధిలో జీవిస్తారు. ఎందుకంటే లూకా 1:37 లో ఇలా చెప్పారు "దేవుడు చెప్పిన ఏమాట ఎన్నడు నిరర్ధకము కానేరదు". ఇది వాగ్ధానము. నమ్మదగినది.

సరిగా చెప్పలేకపోయి ఉంటే క్షమిచండి. కాని చెప్ప దలచుకున్నది మాత్రం ఒక్కటే "మన తల్లి తండ్రులను గౌరవించడంలోనే మన గౌరవం దాగి ఉంది". అర్ధమైందని ఆశిస్తూ, మీకోసం నిర్ణయించబడిన ఆ ఆశీర్వాదాభివృద్ధిని పొందాలని కోరుకుంటున్నాను.

ఇట్లు
మీ నేస్తం