Friday, October 21, 2011

ఎవరన్నారు మౌనం మాట్లాడదని

ఎవరన్నారు మౌనం మాట్లాడదని
నిశ్శబ్దంలో మనసు చెప్పే
ఉసులు చెసే బాసలు
ఎంత అద్భుతంగా ఉంటాయో
ఏ భాషలో చెప్పను

అలసటతో వడలి పోయి
ఇల్లు చేరిన నాకు చిరునవ్వుతో
పిల్ల సమీరంలా నువ్వెదురొస్తే
ఆ మౌనం ఎన్ని భావాలతో సేదదీరుస్తుందో
ఏ భాషలో చెప్పను

సుతిమెత్తగా తగిలిన నీ చేయి
నా చెక్కిలి తాకినపుడు
అది చెప్పె చక్కిలిగింతల
మాటలన్నీకలిగించే హాయిని
ఏ భాషలో చెప్పను

చేయి చేయి కలిపి వేకువ
మంచులో అడుగు కలిపి
రాలిన పున్నాగపూలు ఏరుకోడానికి మనమెళ్ళినపుడు
ఆ వెచ్చదనం చెప్పిన కబురులన్నీ
ఏ భాషలో చెప్పను

నువ్వు లేని ఏకాంతంలో
చుక్కలు లెక్కిస్తూ నేనుంటే
చల్లని ఆ మౌనం నీ గురించి
గుసగుసగా చెప్పిన విషయాలు
ఏ భాషలో చెప్పను

తీగలా నిన్నల్లుకుని మల్లెలా
నీ ఎదపైచేరి మనదైన భాషలొ
చిరు ముద్దుతో జవాబు చెప్పనా
మౌనంగా నా కురులతో
నీ చేయి పలికే మాటలకు

2 comments: