ధనుర్మాసమో మంచు తెరలో
ఏది ముందు ఏది వెనుకో
తెలియకుండా తికమక పెట్టెస్తూ
తెలుసుకునేలోపే చుట్టేశాయి చలికౌగిలితో
నెమ్మదిగా తెల్లని మంచుతెరలను
తొలగిస్తూ బిక్కు బిక్కుమంటున్నాడో
లేక హిమ కన్య సొగసులను తనివి తీర
ఆస్వాదిస్తున్నాడో ఈ సూరీడు, ఏమీ తెలియడం లేదే
వెన్నెల వగలాడి రాత్రంతా
ఊసులాడి నా నిద్ర దోచుకెళ్ళింది
అది చాలదన్నట్లు చలి నన్ను
చుట్టేసి బిగి కౌగిలితో జోకొట్టేసింది
మత్తునుంచి తేరుకునేసరికి
ముంగిట్లో గొబ్బెమ్మ తలనిండా
పూలెట్టుకుని కిసుక్కున నవ్వి
తనేసుకున్న రంగుల హొయలన్నీ చూపిచింది
హా... నాకూ గుర్తొచింది
అమ్మనడిగి నేనూ వెసుకుంటా
పట్టుపావడా, పూలగాజులు మా ఇంటికొచ్చే
ఆనందానికి సంతోషాల స్వాగత మివ్వడానికి
చూస్తారేం................
మీరూ రండి ముస్తాబయ్యి
చక్రపొంగలి, చెరుకుగడలు
మా ఇంట్లోని చేమంతి పూలు
మీకు ఇస్తా మరి