Showing posts with label ఓ తీయని జ్ఞాపకంలా. Show all posts
Showing posts with label ఓ తీయని జ్ఞాపకంలా. Show all posts

Saturday, December 17, 2011

చూస్తారేం................













ధనుర్మాసమో మంచు తెరలో
ఏది ముందు ఏది వెనుకో
తెలియకుండా తికమక పెట్టెస్తూ
తెలుసుకునేలోపే చుట్టేశాయి చలికౌగిలితో

నెమ్మదిగా తెల్లని మంచుతెరలను
తొలగిస్తూ బిక్కు బిక్కుమంటున్నాడో
లేక హిమ కన్య సొగసులను తనివి తీర
ఆస్వాదిస్తున్నాడో ఈ సూరీడు, ఏమీ తెలియడం లేదే

వెన్నెల వగలాడి రాత్రంతా
ఊసులాడి నా నిద్ర దోచుకెళ్ళింది
అది చాలదన్నట్లు చలి నన్ను
చుట్టేసి బిగి కౌగిలితో జోకొట్టేసింది

మత్తునుంచి తేరుకునేసరికి
ముంగిట్లో గొబ్బెమ్మ తలనిండా
పూలెట్టుకుని కిసుక్కున నవ్వి
తనేసుకున్న రంగుల హొయలన్నీ చూపిచింది

హా... నాకూ గుర్తొచింది
అమ్మనడిగి నేనూ వెసుకుంటా
పట్టుపావడా, పూలగాజులు మా ఇంటికొచ్చే
ఆనందానికి సంతోషాల స్వాగత మివ్వడానికి

చూస్తారేం................
మీరూ రండి ముస్తాబయ్యి
చక్రపొంగలి, చెరుకుగడలు
మా ఇంట్లోని చేమంతి పూలు
మీకు ఇస్తా మరి

Monday, November 14, 2011

నాలానే అచ్చంగా నాలనే




పూ సిన ఈ పున్నాగ పూలలో
కనిపించని నా మౌనరాగాలెన్నో
జతకలిసి ప్రతి పూవును ముడివేసి
జ్ఞాపకాల మాలలెన్నో కట్టేశాయి.

అమ్మ చేతిని పట్టుకుని
కొంగు చాటునుండి తొగి చూస్తున్న
నాలానే అచ్చంగా నాలనే
ఆకుల మాటునుండి తొగిచూస్తున్నాయి మొగ్గలన్నీ

చందమామను చూపిస్తూ
అమ్మ పెట్టే గోరు ముద్దలు
తింటూ నే లెక్కపెట్టిన చుక్కల్లానే
తికమక పెట్టేస్తున్నాయి విచుకున్న పువ్వులన్నీ

చిన్ని చేతులతో అన్నయ్య చొక్కా
పట్టుకుని నేనాడుకున్న రైలాటలానే
పువ్వు పువ్వు ఒకదానితోక మరొకటి పుచ్చుకుని
షికారుకు బయదేరాయి చిన్నారి చేతులలో

ఎంతగుచ్చినా తరగడం లేదు
ఈ పూలతో నా జ్ఞాపకాల మాలలు
తనివి తీరని సాయంత్రాలు
నిన్ను దాటి నే వెళ్ళినప్పుడల్లా వెక్కిరిస్తున్నాయి

Tuesday, June 14, 2011

ఓ తీయని జ్ఞాపకంలా




















చల్లగాలి నల్ల మబ్బులు
తొలకరి చినుకులు మల్లె పూలు
గమ్మత్తుగా మత్తెక్కిస్తుంటె
రోజంతా నీకోసం నేనెదురు చూస్తుంటే
ఏదో తెలియని మైకం నను
కమ్మెసి నీ వైపు లాగేస్తుంది
ఎందుకంటావ్? నువ్వేం చెపుతావులె
మాయచెయడమే తెలిసిన
రాజకుమరుడివి పైగా సీమంతరాలలో ఉన్నవాడివి

అందుకే ...

అడిగానని చెప్పు
నీ తలపులలోని
వలపు కన్నియను
పిలిచానని చెప్పు
నీ ఎదలో మెరిసే
వయ్యారి తలపులను
పెదవిపై చేరి
చిరునవ్వుల పూవులే పూయాలని
ఎదురు చూస్తున్నానని
చెప్పు విరిసిన ఆ
నవ్వుల పువ్వుల కోసం
నావైపు నడచివచ్చే
నీ అడుగుల కోసం


ప్రియా
ఉండనా మరి
నీ మదిలొ కదిలె
ఓ తీయని జ్ఞాపకంలా