సముద్రమంతా నీళ్ళుంటాయి, కానీ తాగేందుకే చుక్క నీరు దొరకదు.
నాచుట్టూ ప్రేమించే మనుషులుంటరు కాని మనసులొని మాట పంచుకునేదుకు ఒక్కరుండరు.
ఎందుకిలా పదే పదే ఆరాటం, ఎదో కావాలనుకుని ఎదురు చూసి, మరేదొ పొందుకుని, క్షణమైనా సేద తీరని అలొచనలతో నేను.......
తడి లేని పొడి కేకలు వేసే నాలో నేను.....
అర్ధమయ్యీ అర్ధం కాని నేను.....
అన్నీ ఉన్నా ఎమీ లేదనిపించే నేను........
అసలు నేను నేనేనా........అస్థిత్వంతో ఉన్నానా... ఏమో........
తెలియని దారులలో పరుగులెడుతున్న నేను.
ఎవరి కోసం తపిస్తున్నాను............
దేని కోసం వెతుకుతున్నాను......
ఏంకావాలో తెలిస్తే కదా ఎక్కడ దొరుకుతుందో వెతికేది.....
తెలియకుండా మరి ఈ వెర్రితనంతో ఆ పరుగులేంటి?
ఒక్క క్షణం సతోషం. మరో సారి పట్టలేని ఆనందం. ఆ మరిక్షణమే మృత్యువంటే అమితమైన ప్రేమ......... విరుద్ధ భావాలతో నిండిన నేను.......
ఈ క్షణం ఈ సంతృప్తి చాలు అనిపిస్తుంది........ వెంటనే ఎదో కొదువగా అనిపిస్తుంది. ఏమిటా కొదువ?
నీకోసం నేనున్నాను అనే భరోసానా?
నా కొసం నువ్వు అనే మనసా?
కారే కన్నీళ్ళను తుడిచే నేస్తమా?
ఇష్టంలోనూ కష్టంలోనూ నన్ను హత్తుకునే మనిషా?
ఎమిటా కొదువ?
ఏం కావాలి..........ఎదో తెలిసినట్లుందే..........ఉహు.. మళ్ళీ అర్ధం కావడం లేదు.
ఒంటరిగా ఉండాలని, ఎవరూ లేని చోట నన్ను నేను తెలుసుకోవాలని ఉంది.
మనసు వెలితి పడేలా..... కళ్ళలో తడి పొడిబారేలా.......... సడి చేసే గుండె మూగబోయేలా గట్టిగా ఒక్కసారి... ఒకే ఒక్క సారి ఎడవాలనుంది.
ఇదిగో.ఇలాంటి సమయంలోనే నువ్వు గుర్తుకొస్తావు. నాముందే నిల్చుని "నాకిచ్చిన మాట" అంటూ నిలేస్తావు. నిన్నెప్పుడో గుండె గదిలో కొత్తగా వచ్చిన జ్ఞాపకాలతో, అప్పుడెప్పుడెప్పుడో వచ్చి చేరిన ఆలోచనల పరదాల క్రింద దాచేశాను కదా!
అయినా అవన్ని తొలగించుకుని పైకెలా వచ్చావు? అవునులే తోసుకుని రావడం నీకేమి కొత్త కాదు కదూ!
అవును నేను నీకెం మాట ఇచ్చాను? నా దారిన నే వెళుతున్నాను కదా, రవ్వంత కూడా చప్పుడు లేకుండా. మనసులో మాట నిన్నెక్కడ నిద్రలేపుతుందో అని మౌనంగానే ఉన్నను కదా? మరి నువ్వేంటిలా వచ్చావు?
నన్ను వదలవా ఇంక?
ఎన్నాళ్ళయ్యింది నాతో నేను మాట్లాడుకుని? నన్ను నేను ఓదార్చుకుని ఎన్ని రోజులయ్యింది? రయ్యిమంటూ పిలవని పేరంటనికి వచ్చినట్లు వచ్చేస్తావే ఇలా?
నేనేంటో. నాకేం కావాలో తెలుసుకుంటున్నప్పుడు......... అన్నీ నీకే తెలుసునంటూ...... ఈ క్షణాల్ని కూడ దోచుకెళతావెందుకు?
అయ్యో నా అన్వేషణా దారాలను పుటుక్కున తెంపేసి, ఆలోచనల దారుల్లన్నీ మూసేసి... నాలోకి నన్ను తొసేసి........
ఛా... మళ్ళీ నువ్వే గెలిచావు, నన్ను అయోమయంలో పడేసి.