Wednesday, December 7, 2016

నిజమేనా జయమ్మా?

నమ్మశక్యం కాని జీవితం, ఆదరణ, విజయం, సమకాలీన కాలంలోని ఓ పరమాధ్బుతం "అమ్మ" జయలలిత.

వ్యకిగత కారణాలు ఏవైనా కానివ్వండి అనుకున్నది సాధించిన ధీర, ప్రతికూల పరిస్థితులలో పారిపోకుండా, గెలుపు రుచిచూసిన "పురుట్చి తలైవి". ఎక్కడో పుట్టి, మరెక్కడో మెరిసిన "విప్లవ నాయకి". ఇంతమంది జనం 'అమ్మా' అని ఏడుస్తున్నారంటే ఆమెలోని అమ్మ మనసే కారణం కదా! నాలుగురాళ్ళు వెనకేసుకోమని, పొయే సమయానికి నలుగురు మనుషులను సంపాదిచ్చుకోమని చెప్తారు పెద్దలు. ఆ నాలుగు కాస్తా నలుద్దిక్కులైనాయి తన విషయంలో.

తీయని గొంతు, అంతకంటే తీయనైన ప్రేమ, తనవారనుకుంటే తరగని ఆత్మీయత, దేహీ అన్న గొంతులకు జీవధార, నమ్మిన వారి కొంగుబంగారం, ఒకటనేమిటి చెప్పుకుంటూపోతే తరగని ఘని ఆమె గుణసంపద. కానివారికి మాత్రం పక్కలోబల్లెం.

ఎవడో ఎదో అన్నాడని, ఎదో జరిగిందని లోకం ముఖం చూడలేక, అయినవాళ్ళ ఆదరణ కరువైందని, అమ్మ తిట్టిందని, మరొకటి మరొకటి.........సవాలక్ష కారణలతొ జీవితాన్ని చాలించే ఈతరం అమ్మాయిలకు నిజమైన స్పూర్తి "అమ్మ".

పాషాణం లోపల దాగి, మృత్యువనే సెగకు కరిగిన వెన్నముద్దలా, ఇన్ని నయనాలలో జారింది అశృధారగా.... జయకేతనమెత్తిన లతమ్మ.

నువ్వెవరివైనా, నీకు నాకు పరిచయం లేకున్నా, విన్నదేదైన కానీ...ఎందుకో నువ్వంటే ఇష్టం అంటుంది నామనసు. అలాంటి నీవు ఇలా నిష్క్రమించడం మాత్రం నచ్చలేదు. మరణాన్నికూడా సునాయాసంగా స్వీకరిచగలితే ఎంతబాగుండేది కదా...తలొంచని నీపై రెణ్ణెల్లు పోరాడి గెలిచిదది. నాకనుమానం నువ్వే గెలవనిచ్చావేమో దాన్ని, లేక అంతరంతరాళలో ప్రేమించావేమో మరణాన్ని సైతం,  అందుకే తరలి వెళ్ళావేమో తోడుగా. పోనీ అదేం కాదులే అనుకుంటే  దేహీ అని పట్టిన దోసిలిలో భిక్షగా నీ ప్రాణాలనే వేసావా?
నిజమేనా జయమ్మా?