Monday, November 21, 2011

ఎంత సిగ్గో మరి!

చిగురాకుల మధ్య లో
పుట్టిందో చిన్ని మొగ్గ
బిక్కు బిక్కు మంటూ,
నెమ్మదిగా తొంగి చూస్తూ
ఆకుల మధ్యలో దాగుడుమూతలాడుతూ
రంగులద్దిన పూరేకులు తనలోనే
దాచుకొంటూ కొత్తగా తన
రూపాన్ని సరి చేసుకుంటూ
నే-నెప్పుడు చుసినా ముఖాన్ని
ఆకుపచ్చ రేకల మధ్య
దాచుకునే ఉంటుందీ సుందరి
ఎంత సిగ్గో మరి!

సూరీడు చెప్పే ఊసులన్నిటికి
తల ఊపుతూ, చలి నొక్కిన
చెక్కిలిని సరి చేసుకుంటూ
మా ఇంటి ముంగిట్లో, తొలి వెలుగులో
నాకు చెప్పకుండానే ఫక్కుమన్న
తన నవ్వుల రంగులన్నీ
పరిచేసింది నేను నిదురైనా లేవకముందే
అంతేలే నే పలకరిస్తే తలైనా ఊపదు
రేరాజు చెప్పే కబురులకైతే
విచ్చుకున్న రంగుల పూరెక్కలతో
ప్రతి సమాధానమిస్తుంది
ఎంతటి నెరజాణో కదా ఈ పూబాల

Monday, November 14, 2011

నాలానే అచ్చంగా నాలనే




పూ సిన ఈ పున్నాగ పూలలో
కనిపించని నా మౌనరాగాలెన్నో
జతకలిసి ప్రతి పూవును ముడివేసి
జ్ఞాపకాల మాలలెన్నో కట్టేశాయి.

అమ్మ చేతిని పట్టుకుని
కొంగు చాటునుండి తొగి చూస్తున్న
నాలానే అచ్చంగా నాలనే
ఆకుల మాటునుండి తొగిచూస్తున్నాయి మొగ్గలన్నీ

చందమామను చూపిస్తూ
అమ్మ పెట్టే గోరు ముద్దలు
తింటూ నే లెక్కపెట్టిన చుక్కల్లానే
తికమక పెట్టేస్తున్నాయి విచుకున్న పువ్వులన్నీ

చిన్ని చేతులతో అన్నయ్య చొక్కా
పట్టుకుని నేనాడుకున్న రైలాటలానే
పువ్వు పువ్వు ఒకదానితోక మరొకటి పుచ్చుకుని
షికారుకు బయదేరాయి చిన్నారి చేతులలో

ఎంతగుచ్చినా తరగడం లేదు
ఈ పూలతో నా జ్ఞాపకాల మాలలు
తనివి తీరని సాయంత్రాలు
నిన్ను దాటి నే వెళ్ళినప్పుడల్లా వెక్కిరిస్తున్నాయి

Friday, November 11, 2011

కార్తీక వస్తూనే

















కార్తీక వస్తూనే
తోడుతెచ్చుకుంది చలి చెలియను
మనమేం తక్కువా
అంటూ ప్రకృతి తోడు రమ్మంది
రంగురంగుల విరి బాలలను

తరుణి తలలో
పేరంటాల కొలువులో
మరి చెలికాని సన్నిధిలో
ఎక్కడ చూసినా
సొగసు కుసుమాల సవ్వడులే

తోడొచ్చిన చలి చెలియ
తయారమ్మా అంటూ పెత్తనం
చెలాయిస్తే తగదమ్మా
నీకంటూ చలిమంటలు జావాబిస్తుంటే
చెప్పలేనంత హాయిగా ఉందికదూ!!

చిన్ని పాపాయి
అమ్మ ఒడిలో పొత్తిళ్ళనే
కోరితే, పడుచు జంటలు
కౌగిలి కుంపటి జతచేరితే
మాకూ ఉందో దారంటూ
బామ్మ తాతలు
ముంగిట్లో వేసారు చలిపారదోలె
వెలుగు మంటలు

హా!!!!! ఎటూ చూసినా
మనకు సందడే సందడి
సంక్రాతి పూబంతులు
చేమంతులు, భోగిపళ్ళు
కొత్త బియ్యపు పాయసాలు
వచ్చేవరకు మీరేమంటారు మరి?