Friday, December 10, 2010

I praise యు











Thank you my LORD
You blessed me with your GRACE
You LOVED me with your HEART
For that you sacrificed yourself
For my mistakes.

O my LOVE
I healed by your STRIPES,
AND you make me rich
By giving all your POWER


Even though you are a king
You lived like a poor
to teach me how to become a Queen

You lifted me from all miseries
You molded me in all difficulties
You lead me in all situations
to overcome with JOY

Praise the LORD
From the sunrise to sunset
I praise you
ever and ever in my life.

Thursday, December 9, 2010

మరో రేపటికై ...









రెప్పచాటున నిన్నటి జ్ఞాపకాలను దాచి
మధురమైన నీ తలపులతో
నే నిదురించే వేళలో
నాకోసమే నీ సంకల్పానికి తుదిమెరుగులద్దావు
కదా నేస్తం!

నాసంతోషమే పరమావధిగా
శుభోదయపు పలకరింపులకు
తరలి వచ్చె వేకువకు

సప్తవర్ణాల శోభనిచ్చి
కువకువల సరాగాలు తోడుగా
ఎంత ప్రేమతో పంపావు నాకోసం

నా రేపటిలో నీ కలిమిని చూడాలని
ఉదయించే సూర్యుడితొ నేనూ ఎదగాలని
చెప్పకనే చెప్పేవు సుమా నీ కోరికని

అందుకే,

అలవికాని ఆత్రంతో మేలుకొంటాను ప్రతి ఉదయం
నాకోసం నువ్వేమి తెస్తున్నావో అని
అది అదుకున్న ఆనందపు ఘడియలతో
మనసంతానింపుకుని మరో రేపటికై
సాగిపోతాను ఈ రోజంతా నాదేనంటూ.

Monday, June 7, 2010

తెలిసిన ఒక శూన్యం మనసంతా

మనసు తడిగానె ఉంది
కాని ఆచెమ్మ కళ్ళను చేరడం లేదెందుకో మరి

నీ చెంత చేరాలని
హృదయ బారాన్ని దింపుకోవాలని ఉంది

కాని నీ సన్నిది చేరాలంటే
నాలోని చేతనమే వెక్కిరిస్తుంది ఎన్నాళ్ళకెన్నాళ్ళ కని

నీ నీతిని నాలో నింపుకొని
గమ్యం చేరేలోపు అది వికృతమవుతోంది ఎందుకో మరి?

ఎక్కడ నే తడబడ్డానో తెలియక
తెలిసినట్లే అనిపించినా దిద్దుబాటులో అడుగులు జారిపోతున్నాయెందుకో?

నీ చేతిలోనే నా చేయి ఉంది కాని
నే నడిచే వేళలో నీతో కలిసి నడవాలని మర్చిపోతున్నా నెందుకు?

క్షణ క్షణం నీకు దగ్గరవుతున్నానుకొని
నాకు తెలియకుండానే నీనుండి దూరంగా వెళ్లిపోతున్నాను కదూ ?

దాపరికం లేకుండా నువ్వు
దాచడానికేమి లేని నేను అయినా మనమధ్య తెలియని అగాధం

తెలిసిన ఒక శూన్యం మనసంతా
తెలియనిదల్లా అధిగమించాలన్న కోరికనెలా ఆచరించాలన్నదే?

నన్ను కాదనవని తెలుసు
క్షమించే నీ మనసు తెలుసు అయినా తెలియని భయం

చూసావా! నేను చెప్పాలనుకొన్న
విషయాన్ని కూడా నీకర్దమయ్యెలా చెప్పలేకపోతున్నాను కదూ?

ఇకపై ప్రతి క్షణం ఒకే మంత్రం,
నీవైపు చూస్తూ, నీ మాటలే మదిలో మననం చేస్తూ

బలమైన రక్షణనిచ్చే ఆ చేతులకు
నన్ను నేను అప్పగించుకొవాలని

నీతోనే నేనని నీలోనే సాగాలని
అమ్మలాంటి నీ ఒడిని మళ్ళీ చేరాలని

అందుకోసం నన్ను నేను
సంసిద్ధ పరచుకోవాలని ఆశతో చేస్తున్నా మరోపోరాటం.

Wednesday, May 5, 2010

ఈలాంటి నాతో సహవాసమా నీకు?







అనంత జ్ఞాని నీవు
అల్పమైన నేను,

నీతిమంతుడ నీవు
పాపినైన నేను,

సత్యవంత నీవు
అసత్యమైన నేను,

ప్రేమమూర్తి నీవు
శాపగ్రస్తను నేను,

సృష్టికర్త నీవు
గడ్డిపోచ నేను,

ఈలాంటి నాతో
సహవాసమా నీకు?

ఉనికిలేని నాకై
బలియాగమైనావు,

నా శిక్షను మోసి
నాకో రూపమిచ్చినావు

ఏమని స్తుతియింతునయ్యా
నిన్నేమని వర్ణింతునయ్యా!

ప్రాణమై, మార్గమై
నాబ్రతుకే వెలిగించినావయ్యా
నీ జీవమే నాకిచ్చినావయ్యా.

anata jnAni Ivu
alpamaina nEnu,

nItimatuDa nIvu
brashTu paTTina nEnu,

satyavata nIvu
asatyamaina nEnu,

prEmamUrti nIvu
SApagrastanu nEnu,

SRshTikarta nIvu
gaDDipOcha nEnu,

IlATi nAtO
sahavAsama nIku?

unikilEni nAkai
baliyAgaminAvu,

naa Sikshanu mOsi
nAkO RupumichchinAvu

Emani stutiyimtunayyA
ninnEmani varNitunayyA!

prANamai, mArgamai
nAbratukE veligimchinAvayA
ni jIvamE nAkichchinAvu.

Wednesday, March 10, 2010

చివరి క్షణంలో... మార్పు -1











అది
క్రీస్తును శిలువ వేసిన రోజు. ఆ ఇద్దరి దొంగల మధ్యలో ఉన్న రోజు. వారు ముగ్గురూ ఒకేరకమైన శిక్ష అనుభవిస్తున్నప్పటికి వారి వ్యక్తిత్వాలలోని తేడా గమనించండి.

ముందుగా మనం ఆ ఇద్దరి దొంగలను పరిశీలిద్దాం.

మొదటి దొంగ:
"నువ్వు క్రీస్తువు కదా! నిన్ను నీవు రక్షించుకుని నన్ను కూడా రక్షించు".

ఈ మాటలలో బాధ, భయం కాని తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్నామే అన్న ఒప్పుకోలు కాని లేదు. చావబోతూ కూడా ఎదుటి మనిషిని (కనీసం దేవుడని అంగీకరించే స్థితిలో లేదు కదా!) మనిషిగా చూడలేని పొగరు. బాధపడుతూ కూడా ఎదుటివారిని కించపరిచే లక్షణం. అప్పుడు కూడా తనదైన స్వార్దంఏ చూపించాడు.

అతనిలోని స్వార్ధం, పొగరు బోతు తనం చక్కగా కనిపిస్తున్నాయి. తనకెలాంటి హాని చేయని ఒక మనిషిని, తన చివరి ఘడియలలో కూడా తృణికరించడం ఎంత తప్పు. తను చేసిన నేరాలకు శిక్ష అనుభవిస్తూ కూడా మనిషిగా ఆలోచించలేని ఈలాంటి వాళ్ళు మన మధ్యలో ఎంతో మంది ఉన్నారు.

అతను ఎలా ఉంటే నీకెందుకు అని మీరు ఆడగవచ్చు. లోబడటం, తప్పును ఒప్పుకోవడం వలన వచ్చే లాభాన్ని ఇతను పోగొట్టు కున్నాడని చెప్పడమే.

ఇప్పటి న్యాయస్థానాలు కూడా తప్పు ఒప్పుకున్న వారికి శిక్షను తగ్గించడం, క్షమాభిక్ష పెట్టడం చూస్తున్నాము కదా? అంటే తన ప్రవర్తనను సరి దిద్దుకుని, సరైన మార్గంలో బ్రతకాలనుకునే వారికి మరొక అవకాశాన్ని ఇస్తున్నాయి.

మనుషులే ఇలా అవకాశమిస్తున్నప్పుడు, దేవుడు అవకాశ మివ్వడా? మానవులను తన పోలికలో చేసి, ఈ సృష్టి అంతటిని అతనికొరకే చేసి, వారి కోసం తన ప్రాణాలనే పెట్టిన ఆయన ఇంకెంత చేస్తాడో కదా!

ఆయన "నేనే క్రీస్తును" అన్న మాటలు విన్న వ్యక్తి "పాపులను నశింప చేయడానికి కాదు, రక్షించడానికే వచ్చాను" అని చెప్పిన మాటలు వినలేదా? ఆయన చేసిన అద్భుతాలను వినలేదా?
విన్నాడు. కాని తన అహంభావాన్ని చంపుకోలెక పోయాడు. తన తప్పును ఒప్పుకోలెక పోయాడు. కంపెల్ కావడాని ఏమాత్రము ఇష్ట పడలేదు.

అందుకే రెండో దొంగ లాగా రక్షణను పొందలేకపోయాడు. అతనిలా క్రీస్తుతో కూడ పరదైసులో చేరే అదృష్టాన్ని కొల్పోయాడు.

కేవలం తన నిర్ల్యక్ష్యమే. కళ్ళెదురుగా, ఒకే ఒక మాట దూరంలో ఉన్న రక్షణను శాశ్వతంగా కోల్పోయాడు.

మతమేదైనా, జాతేదైనా కాని ప్రతి మనిషికి కావలసింది తనను తాను సరి చేసుకునే ఓ అవకాశం. అది మనకందుబాటులో ఉన్నప్పడు గుర్తెరిగే వివేకం. తప్పును తప్పని ఒప్పుకుని మళ్ళీచేయకుండా ఉండగల విధేయత.

ఆనాడు ఆదాము అవ్వమ్మ మీద, అవ్వమ్మ సర్పం పైన సాకులు చెప్పారేకాని, తాము చేసింది తప్పని ఒప్పుకుని క్షమాపణ అడగలేదు. వారలా అడిగి ఉంటే ఈనాటి మన పరిస్థితి మరోలా ఉండేమో!

క్షమించమని అడగడటం చిన్న తనమేమీ కాదు, అది అవమానం అంతకన్న కానేకాదు. అది మన విధేయతను చూపడం మాత్రమే. రక్షింప బడటానికి, రక్షణకు చేరువ అవ్వడమే.

ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలకు నేర్పవలసిన మంచి అలవాటు, అలవర్చవలసిన మంచి లక్షణం "చేసిన తప్పు ఒప్పుకుని, దాని నుండి వైదొలగడం".

అలాటి వారిదే ప్రశాంతమయిన జీవితం. వారిదే ఉన్నతమయిన వ్యక్తిత్వం.

మరొక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.
May god bless you. Amen.

Friday, March 5, 2010

నేను సాధించలేనిది లేనే లేదు









మార్గములను సూచించు వాడు,
బ్రతుకు నావను నడిపించు వాడు,

జీవితాలను వెలిగించు వాడు,
యొహోవ నాతోడుండగా!


నేను సాధించలేనిది లేనే లేదు
జయించ లేనిది లేనే లేదు
అసాధ్యమైనది లేనే లేదు
విజయమెపుడు నాదే

ఏ పాటను ఎప్పుడు విన్నా మనసు నిత్య నూతం అవుతుంది. ఎంత నిరాశ, నిశృహలలో ఉన్నా నా తండ్రి నా ప్రక్కనే ఉన్నట్లు ఉంటుంది. నా భుజం తట్టి ధైర్యం చెప్తున్నట్లే అనిపిస్తుంది. నిజంగా ఆ అనుభూతి అనుభవిస్తేనే తెలుస్తుంది.

నిజమే తండ్రి తన బిడ్డలకెపుడూ అన్ని నేర్పి, తగినంత శక్తిని ఇచ్చి అన్ని వేళలా, అన్ని పరిషితులకూ సన్నద్ద పరచే ఉన్నారు. కాని ఆ శక్తిని పొందామని, లేక వినియోగించు కోవడం తెలియక మనమే కొన్ని సమయాలలో భయపడుతూ, లేదా బాధ పడుతూ ఉంటాము.

అలాంటి సమయాలలో కృంగి పోకుండా నడిపించేదే ఈ పాట. ఇది కేవలం పాట మాత్రమే కాడు కాని ఆ తండ్రి మనకిచ్చిన మాటను (నిన్ను విడువను, నీ బలహీన సమ్యాలలో నీకు బలమైన శక్తిగా నేనుంటాను) మననం చేసుకోవడం. తిరిగి శక్తిని పొందుకుని సమస్యను సాధించి జీవితాన్ని కొనసాగించడం.

మీకెప్పుడైనా తట్టుకోలేని సంస్య ఎదురైనప్పుడు, ఈ పాటలోని భాగాలను గుర్తు చేసుకుని చూడండి. వాక్య భాగాలతో ఆయనను శోదించి చూడండి. తేడా ఏమిటో మీరే గమనించగలరు. మీ జీవితంలో అధ్బుతాలను చూడగలరు. చేయగలరు.

మనం చేయవలసిందల్లా ఆయనను అనుసరించడమే.

నావరకు తన మాటలు శక్తి ప్రేరకాలు. ఎల్లప్పుడు నన్ను నడిపించే వెలుగు మార్గాలు.
మీకు కూడ కదూ...............

Thursday, February 18, 2010

విత్తుట - కోయుట 2









విత్తనం విత్తడంలోని ముఖ్యమైన ఉద్దేశ్యం, ప్రతిఫలం. ఒక వేళ ప్రతిఫలం ఆశించకుండా ఏదైనా ఇచ్చాము అంటే దానర్ధం, ఫలాన్ని ఇంతకుముందే మనం అనుభవించామని. అప్పుడు మనం తెలిపేది కృతజ్ఞత.

పరిశుద్ధ గ్రంధం చెప్పినట్లుగా విత్తడంలోని వివిధ పద్ధతులను, ఫలితాలను జాగ్రత్తగా గమనించి తెలుసుకుందాము.

దారిప్రక్కన పడిన విత్తనం:

ఏవరికోసమో, చేయాలి కనుక తప్పదన్నట్లు చేసే పని. ఎక్కడ విత్తుతున్నామో, ఎందుకు విత్తున్నామో ఏమాశించి విత్తుతున్నామో తెలియకుండా చేయడం. చాలామంది చెప్పడం మనం వింటుంటాము "నీకోసం నేను మ్రొక్కుకున్నాను" అని. కాని అది ఫలించిందాలేదా అన్నది మాత్రం వాళ్ళు ఎప్పటికీ గమనించరు. ఎదుటి మనిషి మెప్పు కోరి, తమ విలువ పెంచుకోవడానికో విత్తడం అన్నమాట.

ఒక్కమాటలో చెప్పాలంటే " ఫలించేనో లేదో, ఒక రాయి వేసి చూడటంలో తప్పేముంది" అనుకునే రకం.

ముళ్ళకంచెలలో పాడిన విత్తనం:

వితడానికేమో శ్రద్ధగానే విత్తుతారు. కాని ఎవరైనా ఇది జరిగేనా, ఫలించేనా అని మాట్లాడగానే నిరుత్సాహ పడి పోయి, పంటను గురించి శ్రద్ధ తీసుకోవడం మానేస్తారన్నమాట. ఈలోగా అపవాది వచ్చి, ఆపంటభూమిలో ముళ్ళ విత్తనాలు విత్తేస్తాడు. ముళ్ళకంపలను చూసి బేజారయ్యి అసలు పంటనే వదిలేస్తారు వీరు.

ఇది మధ్యమ పురుష లక్షణం. చివరివరకు పోరాడాలి, సాధించుకోవాలన్న తపన కరువైన మనుషుల లక్షణం

మంచినేలను పడిన విత్తనం:

ఇది ఉత్తమ పురుష లక్షణం.

విత్తిన దగ్గరనుండి, పంట చేతికొచ్చేవరకు అనుక్షణం జాగ్రత్తలు తీసుకే మంచి రైతు లక్షణం. తను విత్తిన పంట మొలకెత్తడం, పెరగడం, ఫలించడం అన్ని దశలను గమనిస్తూ, అవసరమైన చర్య తీసుకూనే గొప్ప లక్షణం. తన మూలధనం ఎలా వాడబడుతుందో, ఏవిధంగా పని చేస్తుందో, ఏదిశగా తన గమ్యం సాగుతుందో గమనించి, తన లక్ష్యం చేరుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకునే ఉత్తమ వ్యాపారవేత్త లక్షణం.

ఇదే భగవతుడు కోరుకునేది.

"మెలకువగా ఉండుడి. దొంగ ఎప్పుడు వచ్చునో అని గమనించే మంచి యజమానునిలా, యుద్ధానికి సిద్ధపడిన సైనికుడిలా అప్రమత్తంగా ఉండండి".

ఏర్పరచుకున్నా లక్ష్యాన్ని సాధించగలమన్న గురితో, విశ్రమిచక ప్రయత్నించండి. అదే నిరీక్షణతో, అదే విశ్వాసంతో విసుగక పోరాడే వారికే దేవుని ప్రోత్సాహం కూడా. సోమరులు దేవుని రాజ్యానికి, అంతే కాదు లోకంలో కూడా ఉన్నతులవడాని అర్హులు కారన్న విషయం గమనించాలి.

కాబట్టి మనకు ఇవ్వబడిన ప్రతి పనిలోను నమ్మకంగా ( లోక యజమానులకు) లోబడి పని చేయాలి. మంచి విత్తనం (శ్రమ, నేర్పు, నమ్మకం, ప్రార్ధన, చివరిగా ధనం) విత్తుతూ తగిన కాలంలో పంటను కోసుకోవడానికి సిద్దపడి ఉండాలి.

ప్రతి చిన్న విషయంలోనూ నమ్మకమైన వారినే యజమాని ఘన పరచడానికి ఇష్టపడతారు. ఆదాసునికే అధికారమివ్వడానికి సిద్ధపడతారన్న విషయం మరచిపోకూడదు.

అప్పగించిన బాత్యత చిన్నదా పెద్దదా మన స్థాయికి తగినదా లేనిదా అన్నది ముఖ్యం కాదు. ఎంత నమ్మకంగా బాధ్యత నెరవేర్చామన్నదే ముఖ్యం. మనుషుల దయను కోరక, దేవుని దయను కోరాలి. ఆయన మనలను మెచ్చుకోవాలి. బాధ్యత నెరవేర్చడమే మనం విత్తే మంచి విత్తనం.

ఒక కార్మికుడు తన నైపుణ్యమనే విత్తనాన్ని విత్తి మంచి పేరు, ఆత్మ సంతృప్తి, మంచి జీతమనే పంటను కోస్తాడు.

ఒక విద్యార్థి కష్టపడి చవడమనే విత్తనం విత్తి, మంచి మార్కులు, ఉన్నతమైన జీవితమనే పంటను కోస్తాడు.

మంచి ఇల్లాలు శ్రధ, ప్రేమ, మంచి నడవడికను విత్తి, ఆనందం, అభివృద్ధి, మంచి కుటుంబమనే పంటకోస్తుంది. ఒడిదుడుకులు లేని సంతోషకరమైన జీవితాన్ని తాను పొదడమే కాక తన పిల్లలకూ అందిస్తుంది.

మంచి విశ్వాసి నిరీక్షణ, ప్రేమ, విధేయత, ఇచ్చుట అనే విత్తనం విత్తి పరిశుద్ధాత్మ, ఆశీర్వాదం, ఆశీర్వాదకరంగా ఉండటం, సంవృద్ధి కలిగి జీవించడం అనే మొదలగు పంటలను కోస్తాడు.

దశమ భాగం విత్తడం గురించిన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం.

Wednesday, February 17, 2010

విత్తుట - కోయుట 1








ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా ఇష్టపడిన విషయం, అనుభవపూర్వకంగా నేర్చుకుని ఆచరించిన విషయం ఇది.

రైతు ఏదైనా పంటను ఆశించినపుడు ముందుగా దానికి సంబధిచిన ప్రణాలికను తయారు చేసుకుంటాడు. ఆ ప్రణాళికను తన మనో నేత్రంతో దర్శించి, ఆపై నమ్మకంతో ఆ పంటను విత్తడానికి పూనుకుంటాడు.

అతనికి ఖచ్చితమైన, నిర్ధిష్టమైన కొన్ని అభిప్రాయాలు, ఆలోచనలు అప్పటికే ఏర్పడి ఉంటాయి. తన నమ్మకం నిజమవుతుంది లేదా నిజమే అనడానికి కావలసిన ఆధారాలను సంపాదించుకుని, అడిగిన వారికి లేదా తన పనికి సరి అయిన సమాధానాన్ని సిద్దపరచుకుని ఉంటాడు.

ముందుగా విత్తనాన్ని సపాదించి శుద్ధి చేసుకుని, పొలం / నేల ను దున్ని పదును చేసి, తగినంత నీరు పెట్టి పంట విత్తడాని తయారు చేసుకుంటాడు. ఎంత పంటను ఆశిస్తున్నాడో దానికి తగినంత విత్తనాన్ని విత్తుతాడు.

అక్కడితో అతని భాధ్యత తీరిపోలేదు. తన పంట ఫలించి చేతికి వచ్చేవరకు నమ్మకంతో దానికి తగిన పోషణ చేస్తూనే ఉంటాడు. ఒకవేళ మధ్యలో ప్రతికూల పరిస్థితులు వస్తే ఎదుర్కోవడానికి మార్గాలను, అవసరమయిన సరంజామాను ముందే సిద్దం చేసుకుంటాడు.

అలాగే ఆత్మీయంగా మనం ఏదైనా ఫలాన్ని ఆశిస్తే, మన హృదయాన్ని ముందుగానే సిద్దం చేసుకోవాలి. మనం ఏమి ఆశిస్తున్నామో సరి అయిన అవగాహన కలిగి ఉండాలి. ఆశిస్తున్న ఫలానికి సంబందిచిన విషయాలను అంటే ఇంతకు ముందు జరిగిన విషయాలను, జరుగుతాయి అన్న సూచనలను గమనించుకోవాలి. వాటిని (ఆ వాక్య భాగాలను) సేకరించుకోవాలి.

ఇక ఇప్పుడు మన ప్రణాలికను సిద్దం చేసుకుని, విత్తనన్ని విత్తాలి. అదే విశ్వాసమనే ఆయుధంతో మన హౄదయాన్ని పదును చేసి, అదృశ్యమైనవి మనో నేత్రం ముందు ఆవిష్కరించి, వాక్యమనే ఆధారంతో విత్తాలి.

ప్రతి రోజు ఆ మనో దౄశ్యాన్ని మరింతగా అభివృద్ధి పరచుకుంటూ, ప్రవచనాలను, వాక్యభాగాలను ఆధారం చేసుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. అపోస్తలులు చెప్పినట్లు అదృశ్యమైనవి చూడగలగడమే, అసాధ్యమైనవి సాధించడంలోని అసలు రహస్యం. నిరీక్షణను ఏమాత్రం కోల్పోకుండా కాపాడుకోవడమే జయించడానికి మూలకారణం.

దేవుని సన్నిధిలో మనం ఒక విషయాన్ని గురించి ప్రార్దిస్తున్నప్పుడు, ఆవిషనికి సంబంధిన విషయాలు ఇంతకు క్రితం జరిగినవి, జరగనున్నవి అని చెప్పే వాక్య భాగాలను నిత్యం ధ్యానిస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితిలోను అపనమ్మకాన్ని దరి చేరనీయకూడదు.

పర్వతారోహకుడికి ముందు చేరవలసిన గమ్యమే తప్ప, ఎక్కి వచ్చిన ఎత్తు గుర్తుకు రాకూడదు. ఒక వేళ అంత ఎత్తునుండి క్రిందకు చూస్తే కళ్ళు తిరిగి, గుండే బలహీన పడి గమ్యం చేరలేక పోవచ్చు. కాబట్టి మనకు కూడా సాధించాల్సిన లక్ష్యమే గుర్తుండాలి కాని, అది సాధ్య పడదేమొ అన్న ఆలోచన ఎప్పుడు దరి చేరకూడదు.

పరిశుద్ధ గ్రంధంలోని మాటలు, ప్రవక్తల మాటలు మనలను ప్రోత్సాహ పరచే మాటలే మన ధ్యానంలో నిత్యం ధ్యానిస్తూ ఉండాలి.

కానుకలు ఇచ్చేటప్పుడు, మనం ఎందుకు ఇస్తున్నామో, ఏమి ఆశించి ఇస్తున్నామో స్పష్టమైన అవగాహన ఉండాలి. ఎందుకంటే మనం ఇది ధేవుని దగ్గర చేస్తున్న ఇన్వెస్ట్ మెంట్. చేసే ఇన్వెస్ట్ మెంట్ గురించిన అవగాహన లేకపోతే వచ్చిన ప్రతిఫలం ఖచ్చితమైనదే అని గ్రహించడం? ఎంత విత్తుతున్నామో, ఎలా విత్తుతున్నామో తెలియకపోతే, ఎంత పంటను కోసుకోవాలో, ఎంత ఆశిస్తున్నామో ఎలా తెలిసేది?

అందుకే దేవుడు ఇలా చెప్తున్నాడు "వెలుగులో నడిచేవాదికి మరెవ్వరూ దీపం తో దారి చూపనవసరం లేదు". దానర్ధం జ్ఞానంతో, తెలివితో, తను చేస్తున్న పనిపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తికి మరెవరి విశ్లేషణ అవసరం లేదు.

విట్టుటలోని పద్దతులు, ఫలితాలు వంటి మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.

Tuesday, February 16, 2010

మన మాటకు విలువ కావాలంటే...









ప్రతి ఒక్కరూ తమ మాట లేదా తమ ప్రార్ధన విలువ నివ్వబడాలని, అది ఫలించాలని కోరుకుంటారు. కాని చాలా సార్లు అది జరగదు. అప్పుడు అనుకుంటాము

"అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమివ్వని వేలుపు
గ్రక్కున విడివంగ వలయు
గదరా సుమతీ" అని.

కాని అసలు లోపం ఎక్కడుందో తెలియదు. చాలా వరకు తెలుసుకునే ప్రయత్నం చేయము. మన విజ్ఞాపన ఫలించాలంటే ఒక సూత్రం ఉంది. మనం ఎవరికైతే విజ్ఞాపన చేస్తున్నామో ఆ వ్యక్తి పట్ల విధేయత కలిగి ఉండటం, మరొకటి మన ప్రవర్తనను బట్టి మనం గౌరవించబడే వారిగా ఉండటం.

నావరకైతే రెండో మార్గమే బాగుంటుంది. ఈ వ్యక్తి గౌరవించ దగిన వ్యక్తి, హాని కరుడు కాదు అని మన గురించిన మంచి అభిప్రాయం ఎదుటి వారికి ఎలా కలుగుతుంది? అందుకు మనం చేయవలిసింది ఏమిటి?

దానికి భగవంతుడు ఇచ్చిన ఆజ్ఞ "నీవు ధీర్ఘాయుష్మంతుడవగుటకు నీ తల్లిని తండ్రిని సన్మానించుము".

ఇక్కడ ధీర్ఘాయుష్మంతుడవగుటకు అన్న మాటను మనం ఏవిధంగా అర్ధం చేసుకుంటాము?
ఒకవ్యక్తి అనేక సంవత్సరాలు జీవించడం అని కదూ! మరి జీవించడం అన్న మాటకు ఉన్న అర్ధాలు తెలుసుకుందాము.
1. ఆరోగ్యంగా ఉండటం.
2. సంవృధ్ధి కలిగి ఉండటం.
3. ఆశీర్వదించబడి, ఇతరులకు ఆశీర్వాదకరంగా బ్రతకడం.
4. ప్రతి సమస్యను సమర్థవంతంగా పరిష్కరిస్తూ, నలుగురికీ మార్గదర్శకంగా జీవించడం.
5. తన చుట్టూ ఉన్న పదిమందికి సహాయం చేస్తూ, వారు కూడా తనవలె సంతోషంగా బ్రతికేలా సహాయం చేస్తూ జీవించడం. ఇలా అనేక మైన అర్ధాలు పరిశుద్ధ గ్రంధంలో చెప్ప బడ్డాయి.

మొదటగా తల్లి తండ్రులను గౌరవించే వ్యక్తి దేవుని దృష్టిలో విలువ కలిగిన వాడు. అది మాత్రమే కాదు ఈ లొకంలో కూడా అతనే ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అలా అని వాళ్ళు చెప్పిన మాటనే శిరోధార్యమనుకోమని కాదు. వాళ్ళు ఏది చెప్పినా విని మొదటగా వారి మాటకు విధేయులై, ఆమాటలోని మంచి చెడులను విశ్లేషించగలగాలి. తన అభిప్రాయాలను వారితో చర్చించి సాధ్యాస్ధ్యాలను వివరించ గలగాలి. అప్పుడే అతను ఇతరులను నొప్పించక ఒప్పించగలిగిన నేర్పరి కాగలడు.

ఏలాగంటే, మన ఇంట్లో మన తో కలిసి జీవించే వారి అభిప్రాయాలు, ఆలోచనా విధానం, వారి మనస్తత్వం తెలిసి మసలుకోగలగడమే మన వ్యక్తిత్వం. ఇంట్లో వాళ్ళనే అర్ధం చేసుకోలేని వాళ్ళు ఇతరులనెలా అర్ధం చేసుకోగలరు? ఇంట్లో వాళ్ళనే ప్రభావితం(కన్విన్స్) చేయలేనివాళ్ళు ఇతరులనెలా ప్రభావితం చేయగలరు? ఆలోచించండి. మనలను కని, పోషించి పెద్ద చేసిన తల్లి తండ్రులకు విలువనివ్వడం మనలను మనం గౌరవిచుకోవడమే కదా?

అదే మనిషి మనుగడకు, అతని అభివృధికి మూలకారణం. అలాఅని పెద్దలు పిల్లలను పెంచే విధానం చెప్పలేదనుకోవద్దు. పిల్లలు మంచి లేదా చెడు మార్గంలో నడిచారంటే అందుకు కారణం, సమాధానం చెప్ప వలసింది పెద్దలే.

"బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పిచు. అతను బాగు పడాలని, సుశిక్షితుడవ్వాలని శిక్షించు కాని చెడిపోవడనికి, చనిపోవడానికి కాదు. పిల్లల అభిప్రాయాలకు విలువనిస్తూ, వారిని గౌరవిచండలోనే దేవుని సమక్ప్లాన్ని నేరవేర్చిన వారవుతారు" ఇది పెద్ద లకు దేవుడిచ్చిన ఆజ్ఞ.

కాబట్టి దేవుడైనా లేదా మరేవరైనా మన మాటలకు విలునివ్వాలన్నా లేదా మన ప్రార్ధనలకు సమాధానమిచ్చి నెరవేర్చాలన్నా ముందు మనం తల్లితండ్రుల మాటకు విలువనిచ్చి విధేయులుగా ఉండటం ముఖ్యం. ఆవిధంగా మంచిచెడుల వివేకాన్ని, విశ్లేషణను మన పిల్లలకు అనుభవ పూర్వకంగా నేర్పిచడమే భగవంతుని గౌరవించడం.

భగవంతుని ఆజ్ఞలను పాటించడమే మనం ఆయనకు ఇచ్చే గౌరవం. అప్పుడే ఆయన మనలను గౌరవించి మన మాటలకు, జీవితాలకు విలువనిస్తారు. ఆయన చెప్పిన మాటను మనమిక్కడ జ్ఞాపకం చేసుకుందాము "నా మాట విని ఆప్రకారము చేయువాడే నా సహోదరుడు". కాబట్టి ఈ మాట ప్రకారం మనం మొదటగా మన తలి తలండ్రులను గౌరవించవలసి ఉంది. క్రీస్తు ఈ లోకంలో జీవించి నప్పుడు 30 సంవత్సరాలు తన తల్లికి (శారీరకంగా) లోబడి మనకు మాదిరిగా నిలిచారు. మిగిలిన 3 1/2 సంవత్సరాలు తన పరలోక తండ్రి ఇష్టాన్ని, తనపై ఉంచిన బాధ్యతను నెరవేర్చారు.

ఈ విధంగా ఆయన ఆజ్ఞను పాటించిన వారు తప్పకుండా సంవృద్ధిలో జీవిస్తారు. ఎందుకంటే లూకా 1:37 లో ఇలా చెప్పారు "దేవుడు చెప్పిన ఏమాట ఎన్నడు నిరర్ధకము కానేరదు". ఇది వాగ్ధానము. నమ్మదగినది.

సరిగా చెప్పలేకపోయి ఉంటే క్షమిచండి. కాని చెప్ప దలచుకున్నది మాత్రం ఒక్కటే "మన తల్లి తండ్రులను గౌరవించడంలోనే మన గౌరవం దాగి ఉంది". అర్ధమైందని ఆశిస్తూ, మీకోసం నిర్ణయించబడిన ఆ ఆశీర్వాదాభివృద్ధిని పొందాలని కోరుకుంటున్నాను.

ఇట్లు
మీ నేస్తం

Wednesday, January 27, 2010

జ్ఞాపకాల తోటలో

జ్ఞాపకాల తోటలో
తొలిసంధ్య ఛాయలో
మెల మెల్లగా తాకి
పసిడి పచ్చని చెట్లమధ్య
విరిసిన మొగ్గలన్నీ
నాకోసమేనంటూ
పరిమళాల చిరుగాలితో
చిరునవ్వులే పూయించి
బ్రతుకు నావకు సులువైన
మార్గమేదో చూపించి
చివరి వరకూ నాకు
తోడు నవుతానంటూ
ప్రియమార దరి చేరిన
నా ప్రాణ నేస్తానికివే
శుభోదయ వందనాలు.