Thursday, October 27, 2011

వీడ్కోలు





















తలవలేదు నేనెపుడు
ఇంత తొందరలో విడిపోతానని
తలవనిది తొందర
పెట్టడమే కదా జీవితం.

ఎగసిపడే కెరటాలుగా
మనసు నిడిన సంతోషం
అక్షరాలుగా మారని భావాలనేకం
మౌనమైనా అర్ధం చేసుకోగల
మనసు మీదన్న ధైర్యం

వెళుతున్నందుకు కాదు సుమా
మీతో ఇన్నాళ్ళూ కలిసి ఉన్నందుకు
“థాంక్స్” అంటే తప్పేమో,
కాని చెప్పేందుకింకో
పెద్ద మాట లేదు మరి

ఉంటాను నేస్తం మీ
నవ్వులలో ఒక నవ్వుగా
జ్ఞాపకాలలో రాలని ఒక పువ్వుగా
దూరమైనా దగ్గరైన స్నేహబంధంతో ఎప్పటికీ

(ఆఫీస్ లోని స్నేహితులకు)

Tuesday, October 25, 2011

పీడకలలా వెంటాడే నిజాలే ఎక్కువ




















కళ్ళముందు కదిలే స్వప్నాలెన్నో.... అంతకు మించి పీడకలలా వెంటాడే నిజాలే ఎక్కువ.

గర్భఫలం దేవుడిచ్చే గొప్ప బహుమానం. కాని అది అనర్హుల చేతిలో పడి వీధుల పాలవుతుందిప్పుడు.

చెట్టుకి కాయ భారమా తల్లికి బిడ్డ భారమా అని ఒక్కప్పటి తల్లులు పిల్లల కోసం ప్రాణలే ఇచ్చేవారు. కాని తమ సౌఖ్యం కోసం పిల్లలే భారమనుకుంటున్నారిప్పుడు.

ముద్దు ముద్దుగా అమ్మ ఓడిలో సేదదీరాల్సిన పసి మొగ్గలు, నన్న మెడను పెనవేయాల్సిన చిన్ని చేతులు చెత్తకుప్పలలో గుప్పెడు మెతుకులేరుకుంటున్నాయి. అమ్మ వడిలో ఆదమరచి నిదురపోవాల్సిన లేత చిగురులు కరౌక్ నేలపై సొమ్మసిల్లినప్పుడు చెమ్మగిల్లని కనులుండవేమో!!!!!!!!!

ఏ పాపం చేశారని ఈ పాపలను ఇలా రోడ్డున పడేసారు. జాలి పడడం తప్ప ఏమి చేయలేని నిస్సహాయత. నిర్ణయం తీసుకునే హక్కు, నీడనివ్వగల ధైర్యం లేని నాకు బాధపడే అర్హత లేదేమో.

ఇది గత ఆదివారం కె పి హెచ్ బి బస్టాప్ లో చూసిన హృదయవిదారక దృశ్యం. కొద్ది క్షణాలు కాళ్ళు కదలక చూపులు మరల్చుకోలేక అలాగే నిలబడి పోయాము నేను నా కూతురు. కొద్ది క్షణాల ముందే ఓ చిన్ని పాప అడుక్కోవడానికి వస్తే చిన్నపిల్లలని జాలిపడి మనం డబ్బులువేస్తే అదే వ్యాపారంగా మరిన్ని పసిప్రాణులను బలిచేస్తారు అన్న మాటలు గుర్తొచ్చి వేయలేదు.

కాని విచిత్రం ఎమిటంటే ఆ పాప తల్లి అక్కడే ఉంది. ఒక ప్రయాణికురాలిలా మంచి బట్టలు వేసుకుని కూర్చుంది. ఈ పాప వాళ్ళ అన్న ఇద్దరు యాచన చేస్తున్నారు. మేము అక్కడే కొంచెం సేపు కూర్చోవడంతో ఆమెను చూడగలిగాము. 10 గంటలు కావస్తుండగా ఆమె వాళ్ళిద్దరినీ తీసుకెళ్ళింది. ఈ ఫోటోలో ఉన్న చిన్నారుల్లిద్దరు కూడ అలాగేనేమో, ఎవరినా వస్తారేమొ చుద్దామని మేము అక్కడే కూర్చున్నాము. ఎవరూ రాలేదు. నా కుతురేమో అమ్మా ఒకరినైనా తీసుకేళ్ళి పెంచుకుందాము, లేదంటే ఏదైనా ఆశ్రమానికి చేరుద్దాము అందాకా మనదగ్గర పెట్టుకుందాము అని గొడవ. నేను ఎమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అలా కూర్చున్నాను. అప్పటికే అక్కడ ఉన్న జనం మేమేదో పిల్లల్ని ఎత్తుకెళ్ళే వాళ్ళలాగా చూస్తుంటే తట్టుకోలేక బస్ ఎక్కేశాము .

ఇంటికి వచ్చిన దగ్గరనుండి నాకూతురు ఒకటే ఏడుపు. పాపం కదా జాలి లేకుండా అలా మనం కూడా వచ్చేశాము. ఎలా ఉన్నారో అని ఏడుపు ఆపదు. తన స్నేహితులకు ఫోన్ చేసింది, వాళ్ళకు ఒక్కరెండు రోజులు ఆశ్రయమివ్వమని లేదా తీసుకొచ్చి మా ఇంట్లో దింపమని. ఇద్దరమే ఉన్నాము, అక్కడి వాళ్ళను చూసి భయమేసి తీసుకురాలేక పోయాము మీరైనా సహాయం చేయండి అని. కాని వాళ్ళు కూడా ఏమి చేయలేకపోయారు.

మావాళ్ళు అబ్బయిలెవరైనా ఉండిఉంటే ధైర్యం చేసేవాళ్ళం. కాని ఆ చిన్నారులను చూసిన దగ్గర నుండీ మనసు భారమైంది. ఎవరైనా మీకు తెలిసిన బాలాశ్రమాల వివరాలు, ఫోన్ నంబరు ఇస్తే ఇకనుండి కనీసం వాళ్ళకైనా తెలియపరుస్తాము. అప్పుడేనా నాకుతురు తృప్తి పడుతుంది.


మీలో ఎవరైనా ఇలాంటి పిల్లలను చేరదీసే వాళ్ళుంటె తెలియచేయండి. మాకు చేతనైన సహాయం చేస్తాము. హైదరాబాదులో అయితే ఇంకా సంతోషం, వ్యక్తిగతంగా మీతో పాలుపంచుకోగలం.

Friday, October 21, 2011

ఎవరన్నారు మౌనం మాట్లాడదని

ఎవరన్నారు మౌనం మాట్లాడదని
నిశ్శబ్దంలో మనసు చెప్పే
ఉసులు చెసే బాసలు
ఎంత అద్భుతంగా ఉంటాయో
ఏ భాషలో చెప్పను

అలసటతో వడలి పోయి
ఇల్లు చేరిన నాకు చిరునవ్వుతో
పిల్ల సమీరంలా నువ్వెదురొస్తే
ఆ మౌనం ఎన్ని భావాలతో సేదదీరుస్తుందో
ఏ భాషలో చెప్పను

సుతిమెత్తగా తగిలిన నీ చేయి
నా చెక్కిలి తాకినపుడు
అది చెప్పె చక్కిలిగింతల
మాటలన్నీకలిగించే హాయిని
ఏ భాషలో చెప్పను

చేయి చేయి కలిపి వేకువ
మంచులో అడుగు కలిపి
రాలిన పున్నాగపూలు ఏరుకోడానికి మనమెళ్ళినపుడు
ఆ వెచ్చదనం చెప్పిన కబురులన్నీ
ఏ భాషలో చెప్పను

నువ్వు లేని ఏకాంతంలో
చుక్కలు లెక్కిస్తూ నేనుంటే
చల్లని ఆ మౌనం నీ గురించి
గుసగుసగా చెప్పిన విషయాలు
ఏ భాషలో చెప్పను

తీగలా నిన్నల్లుకుని మల్లెలా
నీ ఎదపైచేరి మనదైన భాషలొ
చిరు ముద్దుతో జవాబు చెప్పనా
మౌనంగా నా కురులతో
నీ చేయి పలికే మాటలకు

Wednesday, October 19, 2011

మళ్ళీ నువ్వే గెలిచావు......

సముద్రమంతా నీళ్ళుంటాయి, కానీ తాగేందుకే చుక్క నీరు దొరకదు.
నాచుట్టూ ప్రేమించే మనుషులుంటరు కాని మనసులొని మాట పంచుకునేదుకు ఒక్కరుండరు.

ఎందుకిలా పదే పదే ఆరాటం, ఎదో కావాలనుకుని ఎదురు చూసి, మరేదొ పొందుకుని, క్షణమైనా సేద తీరని అలొచనలతో నేను.......

తడి లేని పొడి కేకలు వేసే నాలో నేను.....
అర్ధమయ్యీ అర్ధం కాని నేను.....
అన్నీ ఉన్నా ఎమీ లేదనిపించే నేను........

అసలు నేను నేనేనా........అస్థిత్వంతో ఉన్నానా... ఏమో........
తెలియని దారులలో పరుగులెడుతున్న నేను.

ఎవరి కోసం తపిస్తున్నాను............
దేని కోసం వెతుకుతున్నాను......
ఏంకావాలో తెలిస్తే కదా ఎక్కడ దొరుకుతుందో వెతికేది.....
తెలియకుండా మరి ఈ వెర్రితనంతో ఆ పరుగులేంటి?


ఒక్క క్షణం సతోషం. మరో సారి పట్టలేని ఆనందం. ఆ మరిక్షణమే మృత్యువంటే అమితమైన ప్రేమ......... విరుద్ధ భావాలతో నిండిన నేను.......

ఈ క్షణం ఈ సంతృప్తి చాలు అనిపిస్తుంది........ వెంటనే ఎదో కొదువగా అనిపిస్తుంది. ఏమిటా కొదువ?

నీకోసం నేనున్నాను అనే భరోసానా?
నా కొసం నువ్వు అనే మనసా?
కారే కన్నీళ్ళను తుడిచే నేస్తమా?
ఇష్టంలోనూ కష్టంలోనూ నన్ను హత్తుకునే మనిషా?
ఎమిటా కొదువ?

ఏం కావాలి..........ఎదో తెలిసినట్లుందే..........ఉహు.. మళ్ళీ అర్ధం కావడం లేదు.

ఒంటరిగా ఉండాలని, ఎవరూ లేని చోట నన్ను నేను తెలుసుకోవాలని ఉంది.

మనసు వెలితి పడేలా..... కళ్ళలో తడి పొడిబారేలా.......... సడి చేసే గుండె మూగబోయేలా గట్టిగా ఒక్కసారి... ఒకే ఒక్క సారి ఎడవాలనుంది.

ఇదిగో.ఇలాంటి సమయంలోనే నువ్వు గుర్తుకొస్తావు. నాముందే నిల్చుని "నాకిచ్చిన మాట" అంటూ నిలేస్తావు. నిన్నెప్పుడో గుండె గదిలో కొత్తగా వచ్చిన జ్ఞాపకాలతో, అప్పుడెప్పుడెప్పుడో వచ్చి చేరిన ఆలోచనల పరదాల క్రింద దాచేశాను కదా!
అయినా అవన్ని తొలగించుకుని పైకెలా వచ్చావు? అవునులే తోసుకుని రావడం నీకేమి కొత్త కాదు కదూ!

అవును నేను నీకెం మాట ఇచ్చాను? నా దారిన నే వెళుతున్నాను కదా, రవ్వంత కూడా చప్పుడు లేకుండా. మనసులో మాట నిన్నెక్కడ నిద్రలేపుతుందో అని మౌనంగానే ఉన్నను కదా? మరి నువ్వేంటిలా వచ్చావు?

నన్ను వదలవా ఇంక?

ఎన్నాళ్ళయ్యింది నాతో నేను మాట్లాడుకుని? నన్ను నేను ఓదార్చుకుని ఎన్ని రోజులయ్యింది? రయ్యిమంటూ పిలవని పేరంటనికి వచ్చినట్లు వచ్చేస్తావే ఇలా?

నేనేంటో. నాకేం కావాలో తెలుసుకుంటున్నప్పుడు......... అన్నీ నీకే తెలుసునంటూ...... ఈ క్షణాల్ని కూడ దోచుకెళతావెందుకు?

అయ్యో నా అన్వేషణా దారాలను పుటుక్కున తెంపేసి, ఆలోచనల దారుల్లన్నీ మూసేసి... నాలోకి నన్ను తొసేసి........

ఛా... మళ్ళీ నువ్వే గెలిచావు, నన్ను అయోమయంలో పడేసి.