Tuesday, February 16, 2010

మన మాటకు విలువ కావాలంటే...









ప్రతి ఒక్కరూ తమ మాట లేదా తమ ప్రార్ధన విలువ నివ్వబడాలని, అది ఫలించాలని కోరుకుంటారు. కాని చాలా సార్లు అది జరగదు. అప్పుడు అనుకుంటాము

"అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమివ్వని వేలుపు
గ్రక్కున విడివంగ వలయు
గదరా సుమతీ" అని.

కాని అసలు లోపం ఎక్కడుందో తెలియదు. చాలా వరకు తెలుసుకునే ప్రయత్నం చేయము. మన విజ్ఞాపన ఫలించాలంటే ఒక సూత్రం ఉంది. మనం ఎవరికైతే విజ్ఞాపన చేస్తున్నామో ఆ వ్యక్తి పట్ల విధేయత కలిగి ఉండటం, మరొకటి మన ప్రవర్తనను బట్టి మనం గౌరవించబడే వారిగా ఉండటం.

నావరకైతే రెండో మార్గమే బాగుంటుంది. ఈ వ్యక్తి గౌరవించ దగిన వ్యక్తి, హాని కరుడు కాదు అని మన గురించిన మంచి అభిప్రాయం ఎదుటి వారికి ఎలా కలుగుతుంది? అందుకు మనం చేయవలిసింది ఏమిటి?

దానికి భగవంతుడు ఇచ్చిన ఆజ్ఞ "నీవు ధీర్ఘాయుష్మంతుడవగుటకు నీ తల్లిని తండ్రిని సన్మానించుము".

ఇక్కడ ధీర్ఘాయుష్మంతుడవగుటకు అన్న మాటను మనం ఏవిధంగా అర్ధం చేసుకుంటాము?
ఒకవ్యక్తి అనేక సంవత్సరాలు జీవించడం అని కదూ! మరి జీవించడం అన్న మాటకు ఉన్న అర్ధాలు తెలుసుకుందాము.
1. ఆరోగ్యంగా ఉండటం.
2. సంవృధ్ధి కలిగి ఉండటం.
3. ఆశీర్వదించబడి, ఇతరులకు ఆశీర్వాదకరంగా బ్రతకడం.
4. ప్రతి సమస్యను సమర్థవంతంగా పరిష్కరిస్తూ, నలుగురికీ మార్గదర్శకంగా జీవించడం.
5. తన చుట్టూ ఉన్న పదిమందికి సహాయం చేస్తూ, వారు కూడా తనవలె సంతోషంగా బ్రతికేలా సహాయం చేస్తూ జీవించడం. ఇలా అనేక మైన అర్ధాలు పరిశుద్ధ గ్రంధంలో చెప్ప బడ్డాయి.

మొదటగా తల్లి తండ్రులను గౌరవించే వ్యక్తి దేవుని దృష్టిలో విలువ కలిగిన వాడు. అది మాత్రమే కాదు ఈ లొకంలో కూడా అతనే ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అలా అని వాళ్ళు చెప్పిన మాటనే శిరోధార్యమనుకోమని కాదు. వాళ్ళు ఏది చెప్పినా విని మొదటగా వారి మాటకు విధేయులై, ఆమాటలోని మంచి చెడులను విశ్లేషించగలగాలి. తన అభిప్రాయాలను వారితో చర్చించి సాధ్యాస్ధ్యాలను వివరించ గలగాలి. అప్పుడే అతను ఇతరులను నొప్పించక ఒప్పించగలిగిన నేర్పరి కాగలడు.

ఏలాగంటే, మన ఇంట్లో మన తో కలిసి జీవించే వారి అభిప్రాయాలు, ఆలోచనా విధానం, వారి మనస్తత్వం తెలిసి మసలుకోగలగడమే మన వ్యక్తిత్వం. ఇంట్లో వాళ్ళనే అర్ధం చేసుకోలేని వాళ్ళు ఇతరులనెలా అర్ధం చేసుకోగలరు? ఇంట్లో వాళ్ళనే ప్రభావితం(కన్విన్స్) చేయలేనివాళ్ళు ఇతరులనెలా ప్రభావితం చేయగలరు? ఆలోచించండి. మనలను కని, పోషించి పెద్ద చేసిన తల్లి తండ్రులకు విలువనివ్వడం మనలను మనం గౌరవిచుకోవడమే కదా?

అదే మనిషి మనుగడకు, అతని అభివృధికి మూలకారణం. అలాఅని పెద్దలు పిల్లలను పెంచే విధానం చెప్పలేదనుకోవద్దు. పిల్లలు మంచి లేదా చెడు మార్గంలో నడిచారంటే అందుకు కారణం, సమాధానం చెప్ప వలసింది పెద్దలే.

"బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పిచు. అతను బాగు పడాలని, సుశిక్షితుడవ్వాలని శిక్షించు కాని చెడిపోవడనికి, చనిపోవడానికి కాదు. పిల్లల అభిప్రాయాలకు విలువనిస్తూ, వారిని గౌరవిచండలోనే దేవుని సమక్ప్లాన్ని నేరవేర్చిన వారవుతారు" ఇది పెద్ద లకు దేవుడిచ్చిన ఆజ్ఞ.

కాబట్టి దేవుడైనా లేదా మరేవరైనా మన మాటలకు విలునివ్వాలన్నా లేదా మన ప్రార్ధనలకు సమాధానమిచ్చి నెరవేర్చాలన్నా ముందు మనం తల్లితండ్రుల మాటకు విలువనిచ్చి విధేయులుగా ఉండటం ముఖ్యం. ఆవిధంగా మంచిచెడుల వివేకాన్ని, విశ్లేషణను మన పిల్లలకు అనుభవ పూర్వకంగా నేర్పిచడమే భగవంతుని గౌరవించడం.

భగవంతుని ఆజ్ఞలను పాటించడమే మనం ఆయనకు ఇచ్చే గౌరవం. అప్పుడే ఆయన మనలను గౌరవించి మన మాటలకు, జీవితాలకు విలువనిస్తారు. ఆయన చెప్పిన మాటను మనమిక్కడ జ్ఞాపకం చేసుకుందాము "నా మాట విని ఆప్రకారము చేయువాడే నా సహోదరుడు". కాబట్టి ఈ మాట ప్రకారం మనం మొదటగా మన తలి తలండ్రులను గౌరవించవలసి ఉంది. క్రీస్తు ఈ లోకంలో జీవించి నప్పుడు 30 సంవత్సరాలు తన తల్లికి (శారీరకంగా) లోబడి మనకు మాదిరిగా నిలిచారు. మిగిలిన 3 1/2 సంవత్సరాలు తన పరలోక తండ్రి ఇష్టాన్ని, తనపై ఉంచిన బాధ్యతను నెరవేర్చారు.

ఈ విధంగా ఆయన ఆజ్ఞను పాటించిన వారు తప్పకుండా సంవృద్ధిలో జీవిస్తారు. ఎందుకంటే లూకా 1:37 లో ఇలా చెప్పారు "దేవుడు చెప్పిన ఏమాట ఎన్నడు నిరర్ధకము కానేరదు". ఇది వాగ్ధానము. నమ్మదగినది.

సరిగా చెప్పలేకపోయి ఉంటే క్షమిచండి. కాని చెప్ప దలచుకున్నది మాత్రం ఒక్కటే "మన తల్లి తండ్రులను గౌరవించడంలోనే మన గౌరవం దాగి ఉంది". అర్ధమైందని ఆశిస్తూ, మీకోసం నిర్ణయించబడిన ఆ ఆశీర్వాదాభివృద్ధిని పొందాలని కోరుకుంటున్నాను.

ఇట్లు
మీ నేస్తం

3 comments: