Wednesday, March 10, 2010

చివరి క్షణంలో... మార్పు -1











అది
క్రీస్తును శిలువ వేసిన రోజు. ఆ ఇద్దరి దొంగల మధ్యలో ఉన్న రోజు. వారు ముగ్గురూ ఒకేరకమైన శిక్ష అనుభవిస్తున్నప్పటికి వారి వ్యక్తిత్వాలలోని తేడా గమనించండి.

ముందుగా మనం ఆ ఇద్దరి దొంగలను పరిశీలిద్దాం.

మొదటి దొంగ:
"నువ్వు క్రీస్తువు కదా! నిన్ను నీవు రక్షించుకుని నన్ను కూడా రక్షించు".

ఈ మాటలలో బాధ, భయం కాని తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్నామే అన్న ఒప్పుకోలు కాని లేదు. చావబోతూ కూడా ఎదుటి మనిషిని (కనీసం దేవుడని అంగీకరించే స్థితిలో లేదు కదా!) మనిషిగా చూడలేని పొగరు. బాధపడుతూ కూడా ఎదుటివారిని కించపరిచే లక్షణం. అప్పుడు కూడా తనదైన స్వార్దంఏ చూపించాడు.

అతనిలోని స్వార్ధం, పొగరు బోతు తనం చక్కగా కనిపిస్తున్నాయి. తనకెలాంటి హాని చేయని ఒక మనిషిని, తన చివరి ఘడియలలో కూడా తృణికరించడం ఎంత తప్పు. తను చేసిన నేరాలకు శిక్ష అనుభవిస్తూ కూడా మనిషిగా ఆలోచించలేని ఈలాంటి వాళ్ళు మన మధ్యలో ఎంతో మంది ఉన్నారు.

అతను ఎలా ఉంటే నీకెందుకు అని మీరు ఆడగవచ్చు. లోబడటం, తప్పును ఒప్పుకోవడం వలన వచ్చే లాభాన్ని ఇతను పోగొట్టు కున్నాడని చెప్పడమే.

ఇప్పటి న్యాయస్థానాలు కూడా తప్పు ఒప్పుకున్న వారికి శిక్షను తగ్గించడం, క్షమాభిక్ష పెట్టడం చూస్తున్నాము కదా? అంటే తన ప్రవర్తనను సరి దిద్దుకుని, సరైన మార్గంలో బ్రతకాలనుకునే వారికి మరొక అవకాశాన్ని ఇస్తున్నాయి.

మనుషులే ఇలా అవకాశమిస్తున్నప్పుడు, దేవుడు అవకాశ మివ్వడా? మానవులను తన పోలికలో చేసి, ఈ సృష్టి అంతటిని అతనికొరకే చేసి, వారి కోసం తన ప్రాణాలనే పెట్టిన ఆయన ఇంకెంత చేస్తాడో కదా!

ఆయన "నేనే క్రీస్తును" అన్న మాటలు విన్న వ్యక్తి "పాపులను నశింప చేయడానికి కాదు, రక్షించడానికే వచ్చాను" అని చెప్పిన మాటలు వినలేదా? ఆయన చేసిన అద్భుతాలను వినలేదా?
విన్నాడు. కాని తన అహంభావాన్ని చంపుకోలెక పోయాడు. తన తప్పును ఒప్పుకోలెక పోయాడు. కంపెల్ కావడాని ఏమాత్రము ఇష్ట పడలేదు.

అందుకే రెండో దొంగ లాగా రక్షణను పొందలేకపోయాడు. అతనిలా క్రీస్తుతో కూడ పరదైసులో చేరే అదృష్టాన్ని కొల్పోయాడు.

కేవలం తన నిర్ల్యక్ష్యమే. కళ్ళెదురుగా, ఒకే ఒక మాట దూరంలో ఉన్న రక్షణను శాశ్వతంగా కోల్పోయాడు.

మతమేదైనా, జాతేదైనా కాని ప్రతి మనిషికి కావలసింది తనను తాను సరి చేసుకునే ఓ అవకాశం. అది మనకందుబాటులో ఉన్నప్పడు గుర్తెరిగే వివేకం. తప్పును తప్పని ఒప్పుకుని మళ్ళీచేయకుండా ఉండగల విధేయత.

ఆనాడు ఆదాము అవ్వమ్మ మీద, అవ్వమ్మ సర్పం పైన సాకులు చెప్పారేకాని, తాము చేసింది తప్పని ఒప్పుకుని క్షమాపణ అడగలేదు. వారలా అడిగి ఉంటే ఈనాటి మన పరిస్థితి మరోలా ఉండేమో!

క్షమించమని అడగడటం చిన్న తనమేమీ కాదు, అది అవమానం అంతకన్న కానేకాదు. అది మన విధేయతను చూపడం మాత్రమే. రక్షింప బడటానికి, రక్షణకు చేరువ అవ్వడమే.

ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలకు నేర్పవలసిన మంచి అలవాటు, అలవర్చవలసిన మంచి లక్షణం "చేసిన తప్పు ఒప్పుకుని, దాని నుండి వైదొలగడం".

అలాటి వారిదే ప్రశాంతమయిన జీవితం. వారిదే ఉన్నతమయిన వ్యక్తిత్వం.

మరొక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.
May god bless you. Amen.

No comments:

Post a Comment